Wednesday 24 April 2013

చేమంతి



అది కార్తీకమాసం. సూర్యోదయమై కాసేపయింది. గడ్డి మొక్కల ఆకు కొనల్లో వేలాడే మంచుబిందువుల్లోకి కిరణాలు దూరి పగడాల్లాగా ధగధగలాడుతున్నాయి.
.........................ఊరికే నడుస్తున్నాను. ఏ ప్రయోజనమూ, గమ్యమూ లేని సోమరి నడక.
చాలా దూరం నుండే పగలబడి నవ్వుతున్నాయి చేమంతులూ, బంతిపువ్వులూ. ఆకు కనిపించకుండా విరగబూసి నుంచున్నాయి. ఎంత పొట్టిమొక్కలు ఎన్నిరంగులతో, ఎన్నెన్ని పువ్వులు కుమ్మరించుకుని నిల్చున్నాయి. కళ్ళూ, కాళ్ళూ కట్టేసి నన్నూ నిలబెట్టాయి. వాటి వంకే చూస్తూ కాలం మర్చిపోయాను. అవి నావంకే చూస్తూ పలకరింపుగా, గర్వంగా నొసలు ఎగరేసి మాటలు కలిపాయి.
" చూశావా!.............ఎంత కార్యం సాధించామో !!
ఎందుకోసం జన్మించామో ఆ "ప్రోజెఖ్టు" పూర్తి చేశాం. లక్ష్యాన్ని సాధించాం........గమ్యాన్ని చేరుకున్నాం...........లోకం మానుండి ఆశించినదంతా ఇవ్వ గలిగాం...!! ఔనా.........?............"
ఔను...........!”
"మరి నీ విషయమేమిటి?" నువ్వెందుకు జన్మించావు.............?"
“……………….???...............!!!”
ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. మనసు బిత్తరపోయింది. ఒక్క మాట మాట్లాడబుద్ధి కాలేదు. అక్కడ నిలబడబుద్దీకాలేదు. మెల్లగా సాగారి దూరంగా నడిచాను. …………….. చాలా సేపు నడిచాను. పూలమొక్కల నుండి ఈ శరీరాన్ని చాలా దూరానికి చేర్చాను. కానీ నా మనసు మాత్రం అక్కడే నిలబడి ఉంది.
నెలక్రితం ఒకసారి ఆ బాటవెంటే నడిచాను. అప్పుడూ ఆ మొక్కలున్నాయి. కానీ ఈ పూలసందడీ, ఈ వైభవం అప్పుడు లేదు. చాలా కాలంగా ఆకులూ కొమ్మలతో చడీ చప్పుడూ లేకుండా కూర్చున్న మొక్కలు ఒక్కసారిగా ఇంతసంపదనీ, సౌందర్యాన్నీ ఎలా సాక్షత్కరింపజేశాయి?? ఇదంతా ఎలా సాధ్యపడింది…….??........!!
ఋతుప్రభావం వలన…….!!"
“.............................ఋతువుల ప్రబావమా………?..........!"
"అవును..................! హేమంతం ప్రవేశించింది, చేమంతి పులకించింది. వేరీ సింపుల్.....! ఈ మాత్రం తెలియదా..........?”
"సింపులా?...............ఎలా?...............హేమంతం ప్రవేశించిందని ఆ చిన్ని మొక్కలకెలా తెలిసింది?............... క్యాలెండరు చూసిందా?....................పెద్దబాలశిక్ష తిరగేసిందా?................"
పెద్ద నవ్వు...................తెరలుతెరలుగా నవ్వు................
తరువాత వివరణ మొదలయ్యింది.
"హేమంతమంటే గాఢ దక్షిణాయనం. ఈ కారణంగా పగటి పొద్దుతగ్గి రాత్రి పెరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ నిడివితగ్గి మొక్కలలో శక్తి విడుదలయ్యే సమయం పెరుగుతుంది. అలాగే ఉష్ణోగ్రతలు పడిపోవటం కూడా జోడై బంతి, చేమంతి వంటి కాంపోజిటే కుటుంబానికి చెందిన మొక్కలలో ప్రత్యుత్పత్తి కారక హార్మోన్లు బలపడి పువ్వులు వెల్లివిరుస్తాయి.......................ఇది సైన్స్.................ఇది తెలిస్తే అనేక విషయాల్లో స్పష్టత లభిస్తుంది"
"..............................................................................."
సైన్సు స్పష్టత నిస్తుంది.......................! సరే……………!!
చేమంతులు పూయించటం కోసం దీర్ఘరాత్రులను, శీతలపవనాలను సైన్సే ఇస్తోందా?
కాదు................!”
మరి.............!”
అవన్నీ ప్రకృతి ప్రసాదం
“.................................ప్రకృతా?!!................అదెవరు?!!”
అదెవరు కాదు.....................ప్రకృతి ................అంటే నేచర్.
అదే అడుగుతున్నాను. ప్రకృతంటే వివరమడుగుతున్నాను.................ఇంగ్లీషులో ఏమంటారు అని అడగలేదు...........
ఓహో!....................అలాగయితే..........ప్రకృతంటే................వృక్షజాలాన్ని, పశుపక్ష్యాదులను, విశ్వంలోని గ్రహగమనాలను నియంత్రించే శక్తి.............................ఆ శక్తికి విస్తారమైన జ్ఞానముంటుందా?”
..........................................................
జ్ఞానముండటం కాదు. జ్ఞానమే దాని స్వరూపం..................యూనివర్సల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్సల్ విజ్‌డమ్................దానినే మనం ప్రకృతి అంటాం.....................గ్రహగతుల్ని విజయవంతంగా, వృక్ష,జంతు సమూహాలని విజయం వైపుగా నడిపించే విశ్వవిచక్షణాజ్ఞానాన్నే ప్రకృతి అంటున్నాం..................అదే విశ్వజ్ఞానం. జ్ఞానమే దానిస్వరూపం. విజయమే తన లక్ష్యం.
విజయమంటే ఏమిటి?......................!!”
విజయమంటేనా?.................!ఏ ప్రయోజనం కోసం మొక్క, ఆ జంతువు లేదా ఆ వ్యక్తి జన్మించారో దాన్నందుకోవటమే విజయం. శీతాకాలాన్ని సౌందర్యమయం చెయ్యటానికే నువ్వు చూసిన బంతులు, చేమంతులు జన్మ తీసుకున్నాయి. ప్రకృతితో సంధానపడి, కాలంతో పాటుగా నడిచి విజేతలయ్యాయి.
పూలమొక్కల ప్రస్తావనతో వాటి ప్రశ్న మనసులో మళ్ళీ ధ్వనించింది
..........................నా జన్మకేమిటి పరమార్థం?................. ఎందుకు పుట్టాను?...................!!”
దేనికోసం నీ అంతరంగం తపిస్తోందో.............నీకే తెలియాలి..........................అదే నీ స్వధర్మం! దానికోసమే నువ్వు జన్మించావు. ఆ స్పష్టత లేదా నీకు?”
“....................................దేని కోసం జన్మించానో అది తెలుస్తోంది దాన్నందుకోలేకపోతున్నానన్నదే నా దుఃఖం అమాయకమైన ఆ చిన్ని మొక్కలు సాధించిన ధన్యతని ఇంత జ్ఞానం, యోచనాపరత్వం ఉన్న నేనెందుకు అందుకోలేక పోతున్నాను. ఏమిటి అవరోధం.
నీ ఆలోచనే ఆటంకం................నీ మనోతర్కమే ప్రతిబంధకం.
స్వంత పరిజ్ఞానము స్వీయ ప్రణాళికలకు అవకాశమే లేని ఆ బుజ్జి మొక్కలు వర్తమానంతో సంధానపడి ప్రకృతిలో పరిపూర్ణసాన్నిహిత్యాన్ని స్థిరంచేసుకున్నాయి. విశ్వమంతటా నిండి ఉన్న ఆ ప్రాకృతజ్ఞానం ప్రభవించే ప్రతి తరంగాన్నీ తమలోకి ఆహ్వానిస్తున్నాయి. తాముకూడా ప్రకృతిలో భాగమై విశ్వసౌందర్యానికి హారతులెత్తాయి. పదునైన వర్తమానంతో కలిసి నడవటమే వాటి విజయం....................కానీ!....................నువ్వలా కాదు....................వర్తమానంతో తెగతెంపులు చేసుకుని భూతకాలపు పశ్చాత్తాపాలతో, భవిష్యత్ రంగుల యుక్తులతో...............ఆలోచనలే ఆయుధాలుగా ధరించి, వ్యర్థ సంగ్రామాలలో దివారాత్రులు మునిగితేలుతున్నావు...........................!
ప్రియతమా! నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం వర్తమానం లో ఉంది. నీ విజయరహస్యం నీ జీవితపు వర్తమానంలో భద్రం చేయబడి ఉంది............................!
ఈ ధరణిమీద జీవిస్తున్న అసంఖ్యాకమైన మానవాళినందరినీ కాదని నీకే ఇవ్వబడిన నీ కంఠధ్వనిలా, నీ ముఖ కవళికలా, నీ వేలిముద్రలా అదీ నీ ఒక్కడికే స్వంతం. నీ విజయం నీ ఒక్కడికే స్వంతం. సాధిస్తే నీవే సాధించాలి. లేదంటే ఆ నిధి వ్యర్థమైపోవాలి. అంతే....................!అన్యులెవ్వరూ దాన్ని స్పృశించలేరు.........................!!
అర్థమయిందా.....................? ఏంచెయ్యాలో బోధపడిందా?”
“....................................అర్థమైంది!!”
………………….తర్కవితర్కాలతో సమాధానాలు చెప్పే నా మనసు మాయమై ప్రగాఢ ప్రాకృతమౌనం నన్నావరించింది!!

Monday 14 January 2013

వారణాసి


వారణాసి

వృద్ధాప్యం విలువలేనిది కాదు........

అది కూడా నందనవనమే!...........

అందులో సహితం సౌందర్యం ఉంది. 

ఈ సత్యాన్ని నిరూపించటమే వారణాసి ప్రోజెక్ట్ యొక్క లక్ష్యం, ఆంతర్యం.